నంబర్‌ వన్‌గా నిలబెట్టిన…గ్యాంగ్‌ లీడర్‌

ENTERTAINMENT

అచంచల అగ్రపీఠికపై…

తెలుగు సినీసీమలో తన తరంలో నంబర్‌ వన్‌ హీరోగా చిరంజీవిని ఆ స్థానంలో స్థిరంగా నిలబెట్టిన సినిమా అంటే ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళితే.. ‘ప్రాణం ఖరీదు’(1978)తో తెర మీదకొచ్చిన చిరు ‘ఖైదీ’ (1983 అక్టోబర్‌ 28)తో స్టార్‌ హీరో అయ్యారు. తర్వాత అనేక సక్సెస్‌లు! తోటి హీరోలతో పోటీలు!! బిగ్‌ హిట్‌ ‘పసివాడి ప్రాణం’ (1987)తో పరిశ్రమ రేసులో చిరంజీవి ముందంజలోకి వచ్చారు. అయితే, నాగార్జున ‘శివ’ (1989 అక్టోబర్‌ 5) లాంటి హిట్లు ఆయనకు మళ్ళీ సవాలు విసిరాయి.

 

 

దాన్ని విజయవంతంగా ఎదుర్కొని, ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ (1990 మే 9)తో తన లీడ్‌ను నిలబెట్టుకున్నారు చిరు. కానీ, ‘రాజా విక్రమార్క’(1990), ‘స్టువర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌’ (1991 జనవరి 9) – వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’ అప్పుడొచ్చింది. ‘జగదేక…’ రిలీజైన ఏడాదికి సరిగ్గా అదే తేదీన వచ్చింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. చిరంజీవి తిరుగులేని నంబర్‌ వన్‌ అని సుస్థిరపరిచింది. దటీజ్‌ ది హిస్టారికల్‌ ప్లేస్‌ ఆఫ్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’!

 

 

టైటిల్‌ ఎలా వచ్చిందంటే..
నిజానికి, ముందు విజయ బాపినీడు తీయాలనుకున్న సినిమా ఇది కాదు. ఒకప్పుడు తాను తీసిన, మనసుకు బాగా నచ్చిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫ్యామిలీ డ్రామా ‘బొమ్మరిల్లు’ (’78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ‘షోలే’లోని గబ్బర్‌ సింగ్‌ పాత్రధారి అమ్జాద్‌ ఖాన్‌ డైలాగ్‌ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్‌ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి, అది పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్‌ చేపట్టారు.

 

 

ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్‌ జోడించి ఈ కొత్త సినిమా తీశారు. అప్పటికే హీరో చిరంజీవికీ, ఫ్యా¯Œ ్సకూ వారధిగా నిలిచేలా ‘మెగాస్టార్‌ చిరంజీవి’ అనే ఓ మాసపత్రికను బాపినీడు నడుపుతున్నారు. సినీ రచయిత సత్యమూర్తి (సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తండ్రి) అందులో ‘గ్యాంగ్‌ లీడర్‌’ అనే ఓ సీరియల్‌ రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు, చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్‌గా పెట్టారు. ప్రజాభిప్రాయం తీసుకొని, వారు ఎంపిక చేసిన లోగో డిజైనే వాడారు.

 

 

మధ్యతరగతి కుటుంబ కథ…
పేరు యాక్షన్‌ సినిమాలా అనిపించినా, ఇది రఘుపతి (మురళీమోహన్‌), రాఘవ (శరత్‌ కుమార్‌), రాజారామ్‌ (చిరంజీవి) – అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్‌ కథ. స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక, సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం.

 

 

మధ్యతరగతి యువకుడికి తగ్గట్టు రంగురంగుల కాటన్‌ షర్ట్స్, ఫేడెడ్‌ జీ¯Œ ్సతో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్‌ అప్పట్లో ఓ క్రేజ్‌. సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్‌ వెర్షన్‌ ప్రివ్యూ చూసినప్పుడు, లె¯Œ ్త ఎక్కువైందని అరవింద్‌ బృందం భావించింది. అప్పటికప్పుడు నిడివి తగ్గించారు బాపినీడు. దానికి తగ్గట్టు చిరంజీవి మళ్ళీ డబ్బింగ్‌ చెప్పారు. ఇలా సమష్టి కృషి ‘గ్యాంగ్‌ లీడర్‌’.

 

 

వాళ్ళందరికీ… కెరీర్‌ బ్రేక్‌ ఫిల్మ్‌!
తెలుగులో బప్పీలహరి హవా ఓ ప్రభంజనమైంది ‘గ్యాంగ్‌ లీడర్‌’తోనే! దీంతోనే భువనచంద్ర క్రేజీ రచయిత య్యారు. అంతకు ముందు ‘జగదేక..’కి తండ్రి సుందరంకి సహాయకుడిగా ఉంటూ, సర్వం తానే అయి స్టెప్పులు సమకూర్చిన యువ ప్రభుదేవా ఈ చిత్రానికి అధికారిక డ్యా¯Œ ్స మాస్టర్‌ హోదాలో వాన పాట లాంటివాటితో కనువిందు చేశారు. సీనియర్‌ డ్యా¯Œ ్స మాస్టర్‌ తార అయితే సరేసరి… విశ్వరూపం చూపారు. బాపినీడుకు అల్లుడైన వల్లభనేని జనార్దన్‌కు నటుడిగా వరుస పాత్రలు అందించిందీ ‘గ్యాంగ్‌ లీడ’రే!

 

 

ఒకే రోజు 4చోట్ల శతదినోత్సవం!
అప్పట్లో స్పెషల్‌ ఫ్లైట్‌ ఆసరాగా ఒకే రోజున (చిరంజీవి బర్త్‌డే 1991 ఆగస్ట్‌ 22న) నాలుగు కేంద్రాల్లో (తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయ వాడ) ‘గ్యాంగ్‌ లీడర్‌’ శతదినోత్సవం ఓ అరుదైన విన్యాసం. అతిరథ మహారథులు రాగా, బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండమిచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం. అప్పట్లో ‘అప్పుల అప్పారావు’ చిత్రకథలో నటి అన్నపూర్ణది చిరంజీవి ఫ్యా¯Œ ్స అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పాత్ర. ఏలూరు శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను, వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఆ చిత్రంలో వాడారు.

 

 

హ్యాట్రిక్‌ హిట్ల చిరంజీవితం!
‘గ్యాంగ్‌ లీడర్‌’ తరువాత ‘రౌడీ అల్లుడు’, ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’ – ఇలా హ్యాట్రిక్‌ హిట్లు చిరంజీవి సాధించారు. వాటిలో ‘ఘరానా మొగుడు’ బాక్సాఫీస్‌ వద్ద çసృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ. హీరోగా నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టినఫిల్మ్‌గా గ్యాంగ్‌ లీడర్‌ మెగాస్టార్‌కు సదా ఓ ఆకుపచ్చ జ్ఞాపకం.

 

 

సూపర్‌ హిట్‌ సాంగ్స్‌
అప్పట్లో కొన్నేళ్ళ పాటు ‘గ్యాంగ్‌ లీడర్‌’ పాటలు వినపడని ఊరు, ఊగిపోని కుర్రకారు లేదు. తెలుగులో ‘సింహాసనం’ (1986) లాంటి చిత్రాలతో పాపులరైన బప్పీలహరి కూర్చిన బాణీలవి. ‘స్టేట్‌ రౌడీ’ (1989) తర్వాత చిరంజీవితో ఆయన పనిచేసిన రెండో సినిమా ఇది. వేటూరి, భువనచంద్ర సాహిత్యం సమకూర్చారు. విజయ బాపినీడు ‘నాకూ పెళ్ళాం కావాలి’ (’87) ద్వారా పరిచయమైన రచయిత భువనచంద్ర. ‘గ్యాంగ్‌ లీడర్‌’లో రెండు పాటలు (‘పాలబుగ్గ..’, ‘వయసు వరసగున్నది వాటం..’) వేటూరి రాస్తే, మిగతావన్నీ భువనచంద్ర రచనలు. టైటిల్‌ సాంగ్‌ మొదలు ‘వానా వానా వెల్లువాయె..’, ‘భద్రాచలం కొండ..’, ‘సండే అననురా…’ – ఇలా అరుదైన రీతిలో… ఆల్బమ్‌లోని ఆరు పాటలూ హిట్టే.

 

 

బప్పీలహరి సంగీతం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్, ఎస్పీబీ – చిత్ర గాత్రంలోని భావవ్యక్తీకరణ అన్నీ ఈ పాటల్లో హైలైటే! ఈ తరం మోస్ట్‌ పాపులర్‌ వానపాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ ‘వాన వాన వెల్లువాయె..’ భువనచంద్రకు తొలి సినీ వాన పాట. హైదరాబాద్‌ నుంచి మద్రాసుకు రైలులో బయలుదేరిన భువనచంద్ర పొద్దున్న రైలు దిగే లోగా… ఈ పాటతో సహా నాలుగు పాటలూ రాసేశారు. ఆడియో రిలీజయ్యాక ఆ పాటలన్నీ ఛార్ట్‌ బస్టర్‌ గా నిలిచిపోవడం ఓ చరిత్ర. ఈ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం సాలూరి వాసూరావు సమకూర్చారు. సరిగ్గా 21 ఏళ్ళకు ‘గ్యాంగ్‌ లీడర్‌’లోని అదే ‘వాన వాన వెల్లువాయె…’ పాటను మళ్ళీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ (2012)లో మణిశర్మ రీమిక్స్‌ చేశారు.

 

 

హిందీలోనూ..! ఆకాశానికెత్తిన మీడియా!!
‘గ్యాంగ్‌లీడర్‌’ అదే పేరుతో తమిళంలోకి అనువాదమై, 1991 లోనే నవంబర్‌ 30న తమిళనాట రిలీజై, సక్సెస్‌ సాధించింది. తమిళంలో చిరంజీవికి సాయికుమార్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. కేరళలో తమిళ వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తే, అక్కడా మంచి వసూళ్ళు సాధించింది. తరువాత హిందీ నిర్మాత ఎన్‌.ఎన్‌. సిప్పీ ఇదే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్‌ చేశారు. చిరంజీవికి ఇది రెండో హిందీ సినిమా. తొలి హిందీ సినిమా ‘ప్రతిబంధ్‌’ (తెలుగు ‘అంకుశం’కి రీమేక్‌ – 1990 సెప్టెంబర్‌ 28) లానే ఈ రీమేక్‌కీ రవిరాజా పినిసెట్టి దర్శకులు. చిరంజీవి సరసన మీనాక్షీ శేషాద్రి నటించగా, ఆనంద్‌ – మిళింద్‌ సంగీతంలో ఈ రీమేక్‌ ‘ఆజ్‌కా గూండా రాజ్‌’ (1992 జూలై 10) పేరుతో విడుదలైంది.

 

 

తెలుగులో చిరంజీవి పిన్ని కొడుకు దుర్గబాబు నటించిన ఫ్రెండ్‌ పాత్రను ఆ హిందీ వెర్షన్‌లో నేటి తరం హీరో రవితేజ పోషించడం విశేషం. గమ్మత్తేమిటంటే, తెలుగునాట చిరుకు ఉన్న క్రేజ్‌ దష్ట్యా ఆ కొత్త హిందీ బాణీలకు తెలుగులో పాటలు రాయించి, ఆ డబ్బింగ్‌ సాంగ్స్‌ను ఇక్కడ రిలీజ్‌ చేయడం. అప్పట్లో ‘గూండా రాజ్‌’ పేరిట లియో సంస్థ ద్వారా ఆ డబ్బింగ్‌ పాటల క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక హీరో తెలుగు సినిమా హిందీలో రీమేకై, మళ్ళీ ఆ హిందీ రీమేక్‌ పాటలు తెలుగులోకి డబ్బింగ్‌ అవడం అరుదైన ఘటన. డ్యాన్స్, ఫైట్లలో ఉత్తరాదినీ సమ్మోహనపరచిన చిరంజీవి గురించి ఇంగ్లీష్‌ మేగజైన్లు ముఖచిత్ర కథనాలు రాసి, ఆకాశానికెత్తాయి.

 

 

50 కేంద్రాలు… 100 రోజులు…
‘గ్యాంగ్‌ లీడర్‌’ పెద్ద హిట్‌. దాని రిలీజ్‌కు 5 వారాల ముందు తెలుగునాట టికెట్‌ రేట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగుగడ్డపై తీసిన చిత్రాలకు వినోదపన్నులో భారీ రాయితీ కల్పించింది ప్రభుత్వం. అప్పటికి ఉన్న ట్యాక్స్‌లో ఏకంగా పెద్ద సినిమాలకు దాదాపు 40 శాతం, చిన్న సినిమాలకు 70 శాతం మేర రాయితీ ఇచ్చారు. అలా టికెట్లు రేట్లు పెరిగాక, రాయితీలిచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్‌ ఇదే! నిజానికి, పెరిగిన టికెట్‌ రేట్ల ప్రభావం తెలియక ముందే, ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు. తీరా రిలీజయ్యాక పెరిగిన టికెట్‌ రేట్లలోనూ జనాదరణ బ్రహ్మాండంగా ఉండడంతో, ‘గ్యాంగ్‌ లీడర్‌’ వసూళ్ళ వర్షం కురిపించింది. బయ్యర్లందరికీ లాభాల పంట చేతికి అందింది.

 

 

75కి పైగా ప్రింట్లతో రిలీజై, ఏకంగా 30 కేంద్రాలలో నేరుగా, మరో 15 – 20 కేంద్రాలలో నూన్‌షోలతో… అన్నీ కలిపి 50 సెంటర్లలో ‘గ్యాంగ్‌ లీడర్‌’ వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌ సుదర్శన్‌ 70 ఎం.ఎంలో ఏకంగా 162 రోజులు ఆడింది. చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ వచ్చి, సిల్వర్‌ జూబ్లీ మిస్సయింది. తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్‌ను శాంతి, ప్రశాంతి అంటూ రెండుగా చేశాక, వాటిలో వచ్చిన తొలి సినిమా ‘గ్యాంగ్‌ లీడ’రే! ఏకకాలంలో ఆ రెండిట్లోనూ 6 వారాలాడింది. అంతకు ముందు శారద– శోభన్‌బాబుల ‘మనుషులు మారాలి’(’69) ఇలాగే విజయవాడలో ఒకేసారి రెండు (లీలామహల్, శేష్‌ మహల్‌) హాళ్ళలో 6 వారాలాడిన ఘనత దక్కించుకుంది. తర్వాత మళ్ళీ 22ఏళ్ళకు గ్యాంగ్‌లీడర్‌ సినీలవర్ల బెజవాడలో ఆ అరుదైన విన్యాసం చేసింది.

 

 

ఇటు మెగాస్టార్‌… అటు లేడీ అమితాబ్‌…
‘గ్యాంగ్‌లీడర్‌’కు చిరంజీవితో పాటు విజయశాంతి పెద్ద ప్లస్‌. ‘కర్తవ్యం’ (1990 జూన్‌ 29) హిట్టయ్యాక, యాక్షన్‌ హీరోలకు దీటుగా విజయశాంతికి ‘లేడీ అమితాబ్‌’ అనే ఇమేజ్‌ ఉన్న రోజులవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *